డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్(Kedarnath)లో జరిగిన ఉప ఎన్నికలో.. బీజేపీ విజయం సాధించింది. ఆ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశా నౌటియాల్ గెలుపొందారు. 5622 ఓట్ల తేడాతో ఆమె విక్టరీ కొట్టారు. ఆశాకు 23814 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి , కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రావత్‌కు 18192 ఓట్లు పడ్డాయి. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో.. బీజేపీ అభ్యర్థి గెలవడం పట్ల సీఎం పుష్కర్ సింగ్ థామీ సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పనులపై కేదార్నాథ్ ప్రజలు విశ్వాసం చూపినట్లు సీఎం తన ట్వీట్లో వెల్లడించారు. పవిత్ర భూమి కేదార్నాథ్ గురించి తప్పులు ప్రచారం చేసే వారికి ఇది గట్టి కౌంటర్ అని ఆయన పేర్కొన్నారు.
కేదార్నాథ్ అసెంబ్లీ సీటు నుంచి ఇప్పటి వరకు అయిదుసార్లు మహిళలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 విధాన సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆశా నౌటియాల్ విజయం సాధించారు. ఆ తర్వాత 2007లో కూడా ఆమే విక్టరీ కొట్టారు. ఇక 2012లో కాంగ్రెస్ అభ్యర్థి శైలా రాణి రావత్ ఆ స్థానం నుంచి గెలుపొందారు. అయితే 2022లో శైలా రాణి.. బీజేపీ సీటుపై పోటీ చేసి విజయం సాధించారు. ఆమె మృతిచెందడంతో.. శైలా రాణి స్థానం ఆశా నౌటియాల్ పోటీ చేసి గెలుపొందారు. దీంతో అయిదోసారి ఆ స్థానం నుంచి మహిళా అభ్యర్థే విజయం సాధించారు.