న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో సమాచార హక్కు చట్టం (RTI) నీరుగారిపోతున్నది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి ప్రజలు సమాచారాన్ని పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు. సమాచార కమిషన్లలో ఏదైనా అప్పీల్ లేదా ఫిర్యాదు చేస్తే, అది విచారణకు రావడానికి ఏండ్లకు ఏండ్లు సమయం పడుతున్నది. ఉదాహ రణకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక అప్పీల్ లేదా ఫిర్యాదునో జూలై 1న దాఖలు చేశారనుకుంటే అది 29 ఏండ్ల తర్వాత 2054లో విచారణకు వస్తుంది అని ఓ స్వచ్ఛంద సంస్థ గురువారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సమాచార కమిషన్లలో నెలవారీ పరిష్కారమవుతున్న కేసుల సంఖ్య ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఉన్న సమాచార కమిషన్ల రిపోర్ట్ కార్డును విజిలెంట్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రచురించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న సమాచార కమిషన్లలో నాలుగు లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక రాష్ర్టాల వారీగా సమాచార కమిషన్లలో నెలవారీ పరిష్కారమవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో ఒక కేసుకు 29 ఏండ్ల రెండు నెలలు, త్రిపురలో 23 ఏండ్లు, ఛత్తీస్‌గఢ్‌లో 11 ఏండ్లు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఏడేండ్లు సమయం పడుతుందని ఈ నివేదిక వెల్లడించింది.
18 కమిషన్లలో ఒక కేసు పరిష్కారానికి ఏడాదికి పైగా సమయం పడుతున్నదని తెలిపింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రతి కమిషన్ ఈ చట్టంలోని నిబంధనల అమలుపై ప్రతి సంవత్సరం నివేదికను తయారు చేసి పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ సమర్పించాలి. కానీ 29లో 20 సమాచార కమిషన్లు 2023-24 ఏడాదికి తమ వార్షిక నివేదికలనే తయారు చేయలేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 20 సమాచార కమిషన్లలో 4,13,972 అభ్యర్థనలు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.