Punjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు మెరుగైన విద్యను అందిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వప్నాన్ని తమ పార్టీ సాకారం చేస్తుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని ప్రతి చిన్నారి వారు ఎంత పేదవారైన నాణ్యమైన విద్యను వారికి చేరువ చేస్తానని పేర్కొన్నారు.
అంతకుముందు అమృత్‌సర్‌లో శ్రీ రాం తీర్ధ్ మందిర్‌ను కేజ్రీవాల్ సందర్శించారు. ఈ ఆలయ బోర్డును వాల్మీకి సమాజ్ సభ్యులతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కేజ్రీవాల్ ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలు సీఎం పదవి కోసం పాకులాడుతూ కీచులాడుకుంటున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్ మాఫియాను అణిచివేయడంలో కానీ, ప్రార్ధనా మందిరాల పవిత్రతను కాపాడటంలో కానీ ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదని విమర్శించారు.
డ్రగ్స్ కేసులో ఎస్ఏడీ నేత విక్రం సింగ్ మజితియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు వీరికి ఐదేండ్లు పట్టిందని ఆరోపించారు. మజితియాకు ముందస్తు బెయిల్ తిరస్కరించినా అరెస్ట్ చేసేందుకు సాహసించడం లేదని ఎద్దేవా చేశారు. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన, గాయపడిన బాధితులకు కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు.