చండీఘడ్: పంజాబ్ కాంగ్రెస్(Punjab Congress) పార్టీ చీఫ్ అమరిందర్ రాజా వారింగ్‌ను అయిదు రోజుల్లోగా అరెస్టు చేయాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి బూటా సింగ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆ ఆదేశాలు ఇచ్చింది. తర్న్ తారన్లో జరిగిన ఎన్నికల సభలో రాజా వారింగ్ ఆ వ్యాఖ్యలు చేశారు. కిషోర్ మక్వానా నేతృత్వంలోని ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మే 5వ తేదీన ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం పట్ల ఆ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. యాక్షన్ టేకన్ రిపోర్టును ఇంకా సమర్పించలేదని కమిషన్ పేర్కొన్నది.
డీఎస్పీలు హర్‌ప్రీత్ సింగ్, గుల్జార్ సింగ్‌తో పాటు దివంగత బూటా సింగ్ కుమారుడు సరబ్జోత్ సింగ్ కూడా ఇవాళ జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నారు. చట్టం ప్రకారం సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ కోరింది. అయిదు రోజుల్లోగా ఆ చర్యలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కమిషన్ పేర్కొన్నది. దర్యాప్తును పూర్తి చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ తెలిపింది. ఒకవేళ దర్యాప్తులో మళ్లీ ఎటువంటి జాప్యం జరిగినా, వారిపై 1989 నాటి ఎస్సీ-ఎస్టీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ హెచ్చరించింది.