న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో తదుపరి అరెస్ట్ కాబోయేది అరవింద్ కేజ్రివాలేనని గత కొన్ని రోజులుగా బీజేపీకి చెందిన కీలక నేతలు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా అదే వ్యాఖ్య చేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను లిక్కర్ స్కామ్లో అరెస్టవుతానని సత్యపాల్ మాలిక్గానీ, ఇతర బీజేపీ బడా నేతలుగానీ ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తే చేయనీగానీ ఈ బెదిరింపులు ఎందుకని ఆయన మండిపడ్డారు. కేజ్రివాల్ అరెస్ట్వుతాడని బీజేపీ నేతలు ఎప్పుడూ చెబుతున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐని వాళ్లు కంట్రోల్ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. లేకపోతే.. ఈడీ, సీబీఐ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనే విషయం బీజేపీ నేతలకు ఎలా తెలుస్తుందని కేజ్రివాల్ ప్రశ్నించారు.