ఢాకా, మే 26: ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ని పదవి నుంచి తప్పించేందుకు తమకు ఉన్న అన్ని అవకాశాలను బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వాకర్ ఉజ్ జమాన్ వెదుకుతున్నట్లు ఉన్నత స్థాయికి చెందిన నిఘా వర్గాలు సోమవారం సీఎన్ఎన్కి తెలియచేశాయి. ఉన్నత స్థాయి అధికారిక సమావేశాలలో పాల్గొనడం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్న సైన్యం తన ఉద్దేశాలను పత్రికా ప్రకటనల ద్వారా సూచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోసం వచ్చే ఏడాది జూన్ వరకు వేచి ఉండాలన్న యూనస్ ప్రతిపాదనతో జమాన్ సంతృప్తి చెందడం లేదని వారు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలను పూర్తిచేయాలని జమాన్ పట్టుపడుతున్నారు. యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సవాలు చేసేందుకు రాజ్యాంగంలోని సందిగ్ధతలను పరిశీలించడంతోసహా వివిధ అవకాశాలను జమాన్ వెదుకుతున్నారని వారు వివరించారు.