Odisha | భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. పోకిరీల నుంచి కాపాడమంటూ ఆర్మీ అధికారి అయిన కాబోయే భర్తతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోయిన ఒక మహిళా న్యాయవాది పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టుపట్టుకుని కొట్టి, కాళ్లూ, చేతులు కట్టేసి దారుణంగా హింసించడమే కాక, ఆమె బట్టలను ఊడదీసి లైంగికంగా వేధించారు. తర్వాత ఆమెపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారు. ఈ ఘటన ఈ నెల 15న జరుగగా, రిమాండ్ నుంచి విడుదలైన బాధితురాలి ఫిర్యాదుతో ఈ అమానుష కాండ వెలుగుచూసింది.
అసలేం జరిగింది?
రెస్టారెంట్ యజమాని, మహిళా న్యాయవాది అయిన 32 ఏండ్ల మహిళ ఆర్మీ కెప్టెన్, కాబోయే భర్తతో ఈ నెల 15న రెస్టారెంట్ మూసి బయటకు వస్తుండగా, కొందరు పోకిరీలు వేధించారు. దీంతో వారు వెంటనే భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించారు. అక్కడ సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ వారితో అనుచితంగా ప్రవర్తించింది. ఆర్మీ అధికారిని పోలీసులు అకారణంగా బంధించారు. ఇదేమని ప్రశ్నించిన ఆ మహిళను కొట్టడం ప్రారంభించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిఘటించిన ఆమె ఆత్మరక్షణకు కానిస్టేబుల్ చేతిని కొరికింది. దాంతో ఆమెను బంధించి లాకప్‌లో పడేశారు.
మర్నాడు ఉదయం స్టేషన్‌కు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆమె ఛాతిపై, శరీరంపై తన్నడం ప్రారంభించాడు. చాలా సేపు అమెను కొట్టి, ఆమె ప్యాంట్‌ను ఊడదీశాడు. తర్వాత తన ప్యాంట్ కూడా కిందకు లాగి అతని ప్రైవేట్ పార్టును చూపిస్తూ ఎంతసేపు నీవు మౌనంగా ఉండగలవు అంటూ దూషించాడు. తర్వాత మహిళా కానిస్టేబుల్‌ను కొట్టిందని ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి కోర్టుకు పంపడంతో రిమాండ్ విధించారు. తర్వాత ఆమెకు బెయిల్ రావడంతో పోలీస్ స్టేషన్లో తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధ్యులైన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.