లక్నో: బాలికను కారులో తీసుకెళ్లిన ఆర్మీ వ్యక్తి అందులో మరిచిపోయాడు. కారు డోర్ లాక్ చేసి ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయాడు. దీంతో ఊపిరాక ఆ చిన్నారి మరణించింది. (Girl Dies In Car) ఆర్మీ అధికారి అయిన బాలిక తండ్రి ఫిర్యాదుతో ఆ ఆర్మీ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లా నిదానీ గ్రామానికి చెందిన సోంబీర్ పూనియా గత నాలుగేళ్లుగా మీరట్‌లోని ఆర్డినెన్స్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఫజల్పూర్లోని ఆర్మీ కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మూడేళ్ల వర్తిక, మూడు నెలల భవి అతడి కుమార్తెలు.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లాన్స్ నాయక్ నరేష్ అదే ఆర్మీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. సోంబీర్ కుటుంబానికి పరిచయం ఉన్న అతడు అక్టోబర్ 30న ఇంటి బయట ఆడుకుంటున్న వర్తికను చూశాడు. ఆ చిన్నారిని తన కారులో బయటకు తీసుకెళ్తానని సోంబీర్ భార్య రీతూకు చెప్పాడు. తొలుత నిరాకరించిన ఆమె ఆ తర్వాత అంగీకరించింది.
మరోవైపు నరేష్ ఆ బాలికను తన కారులో తీసుకెళ్లాడు. కంకేర్ఖేడాలో రోహటా రోడ్డు వద్ద కారు ఆపాడు. పాపను కారులో మరిచి డోర్ లాక్ చేశాడు. ఫ్రెండ్స్‌ను కలిసి పార్టీలో బిజీ అయ్యాడు. ఆ తర్వాత డ్యూటీకి వెళ్లిపోయాడు.
అయితే తమ పాప ఇంటికి చేరకపోవడంతో ఆర్మీ అధికారి సోంబీర్ కుటుంబం ఆందోళన చెందింది. నరేష్‌కు ఫోన్ చేయగా తాను డ్యూటీలో ఉన్నానని చెప్పాడు. దీంతో కుమార్తె మిస్సింగ్‌పై ఆ ప్రాంత పోలీసులకు సోంబీర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ కారు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఊపిరాడక చనిపోయిన చిన్నారిని కారు లోపల గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్మీకి చెందిన నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.