జైపూర్: అనురాధా పాశ్వాన్ వయసు 32 ఏళ్లు. 25 మందిని పెళ్లి చేసుకుని.. వాళ్లను మోసం చేసిందామె. వారి ఇండ్ల నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లింది. అనురాధా పాశ్వాన్‌ను లూటింగ్ బ్రైడ్ అని.. లుటేరి దుల్హన్(Looteri Dulhan) అని పిలుస్తున్నారు. వధువు పాత్రలో ఘరానా మోసాలకు పాల్పడుతున్న అనరాధను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లే..
కొత్త పట్టణానికి వెళ్తే, కొత్త పేరుతో ఆమె పరిచయం చేసుకునేది. పెళ్లికి రెఢీ అంటూ మగవాళ్లను మోసం చేసేది. ఆదర్శమైన వధువుగా నటిస్తూ.. అత్తారింట్లో ముచ్చటైన కోడలి పాత్రను పోషిస్తూ.. అనురాధా పాశ్వాన్ అందర్నీ మోసం చేసేది. ఫేక్ మ్యారేజీలతో ఉడాయిస్తున్న ఆ కిలాడీని సవాయి మాదోపూర్ పోలీసులు పట్టుకున్నారు. రివర్స్ గేమ్ ఆడి ఆమెను అరెస్టు చేశారు.
ఒంటరిగా ఉన్నాను.. పేదింటి పిల్లను.. నిస్సహాయురాలిని.. ఉద్యోగం లేని సోదరుడున్నాడు.. పెళ్లి చేసుకోవాలి.. ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబూతూ.. వెళ్లిన ప్రతి చోట అనురాధ పరిచయం చేసుకునేది. కానీ ఓ ఫేక్ మ్యారేజీ గ్యాంగ్‌కు ఆమే లీడర్. నమ్మించి మోసం చేయడంలో ఆమె ఎక్స్పర్ట్. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల వద్దకు ఆమె ఫోటోలను, ప్రొఫైల్‌ను గ్యాంగ్‌లోని సభ్యులే తీసుకెళ్లేవారు. పెళ్లిల బ్రోకర్ కూడా ఆమె గ్యాంగ్‌లో సభ్యుడై ఉంటారు. పెళ్లి కుదురుస్తామని చెప్పి ఆ బ్రోకర్ పాత్ర పోషించిన వ్యక్తి కూడా 2 లక్షలు తీసుకుంటాడు.
ఒకవేళ అంతా ఓకే అయితే పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్లి ఒప్పందం కుదిరాకా.. గుడిలోనే, ఇంట్లోనో పెళ్లి నిర్వహిస్తారు. సంప్రదాయ, ఆచారాల ప్రకారమే ఆ వేడుక జరుగుతుంది. ఇక ఆ తర్వాతే అసలు గేమ్ మొదలవుతుంది. వరుడితో, అతని ఇంటివాళ్లతో చాలా హుందాగా ప్రవర్తిస్తుందామె. నమ్మకాన్ని గెలుచుకుంటుంది. కుటుంబంలోని ప్రతి వ్యక్తితో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పర్చుకుంటుంది. కొన్ని రోజుల్లోనే తన నిగూఢ ప్లాన్‌ను అమలు చేస్తుంది. ఇంట్లో వాళ్లకు ఆహారంలో మత్తు ఇచ్చి.. బంగారం, నగదుతో పరారీ అవుతుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నా పట్టుకెళ్తుంది.
కిలాడీ అనురాధ జిత్తులకు బాధితుడైన విష్ణు శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కూపీ లాగారు. సవాయి మాదోపూర్‌కు చెందిన విష్ణుశర్మ హిందూ సంప్రదాయ పద్దతుల్లో పాశ్వాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. బ్రోకర్ పప్పూ మీనా ద్వారా పెళ్లి కుదిరింది. పప్పూ మీనాకు విష్ణు 2 లక్షలు ఇచ్చాడు. పెళ్లి అయిన రెండు వారాల్లోనే ఇంట్లో ఉన్న 1.25 లక్షల విలువైన జ్వలరీ, 30 వేల నగదు, 30వేల ఖరీదైన ఫోన్‌ను పాశ్వాన్ ఎత్తుకెళ్లింది. లోన్ తీసుకుని పెళ్లి చేసుకున్నానని, కానీ పాశ్వాన్ అలా మోసం చేస్తుందని అనుకోలేదన్నాడు. అనురాధ పరారీ అయిన రోజు తాను ఇంటికి వచ్చి భోజనం చేశానని, ఆ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్లిపోయినట్లు చెప్పాడు. విష్ణు శర్మ, అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విష్ణు ఇచ్చిన సమాచారం ఆధారంగా సవాయి మాదోపూర్ పోలీసులు ట్రాప్ ప్లాన్ చేశారు. పెళ్లి కొడుకు పాత్రలో ఓ కానిస్టేబుల్ నటించాడు. బ్రోకర్ ద్వారా పాశ్వాన్‌ను పెళ్లికి ఒప్పించి, ఆమెను పట్టుకున్నారు. భూపాల్‌లో ఆమెను అరెస్టు చేశారు.