న్యూఢిల్లీ: దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న డోపింగ్ జాఢ్యం పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జాతీయ క్రీడా బిల్లు ద్వారా పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం మరోవైపు ఆటల్లో వేళ్లూనుకుపోయిన డోపింగ్ భూతాన్ని తరిమేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా క్రీడా బిల్లుతో పాటు ‘నేషనల్ యాంటీ డోపింగ్ బిల్-2025’ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ బిల్లులో మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా స్వతంత్ర అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్‌లో పట్టుబడ్డ అథ్లెట్లపై జరిమానాలు విధించకపోవడం, నాడాలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేలా బిల్లును రూపొందించారు.
వాస్తవానికి 2022 లో అప్పటి క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. అయితే నాడా స్వతంత్రతను దెబ్బతీస్తూ కేంద్రం వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాడా ఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీని ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంత్రి మాండవీయా.. వాడా అధికారులతో నిరంతర సంప్రదింపులతో బిల్లులో కీలక మార్పులు చేశారు. ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం లేకుండా డోపింగ్ నిరోధక ఏజెన్సీలు పనిచేయాలన్న వాడా నిబంధనలను బిల్లులో ప్రధానంగా పొందుపరిచారు. గత బిల్లులో ఉన్న విధంగా అప్పీల్ ప్యానెల్‌ను సమీక్షించే అవకాశం యాంటీ డోపింగ్ బోర్డుకు ఉండదు. ముఖ్యంగా క్రీడల్లో డోపింగ్ నిరోధక వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు నాడా పని విధానంపై ఫ్రేమ్‌వర్క్‌తో పాటు ఎన్‌డీటీఎల్ ఏర్పాటు క్రీడల్లో యాంటీ డోపింగ్ కోసం నేషనల్ బోర్డు ఏర్పాటు బిల్లులో కీలకంగా కనిపిస్తున్నాయి.