కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని పోషియాన్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఘటన అనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. షోపియాన్‌లోని ఛోటేపోరా గ్రామంలో సెలవులో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ ముఖ్తార్ అహ్మద్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ముఖ్తార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
అంతకుముందు పుల్వామాలో సర్పంచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తృటిలో తప్పించుకున్నాడు. కాల్పుల శబ్దం విని మరికొందరు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం ప్రకారం.. పుల్వామా జిల్లాలోని పంచాయతీ అరిహాల్-బీ సర్పంచ్ గులాం నబీపై మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి చేశారు. బుద్గామ్‌లో ఒక రోజు ముందు, సర్పంచ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం బుద్గాం జిల్లా అదురా గ్రామంలోని సర్పంచ్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చారు.
ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ నెలలో ఇప్పటి వరకు ముగ్గురు పంచాయతీ ప్రజాప్రతినిధులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ నెల 9న శ్రీనగర్‌లోని ఖోన్ముహ్లో ఉగ్రవాదులు ఇంట్లోకి ప్రవేశించి పీడీపీ సర్పంచ్ సమీర్ అహ్మద్ భట్‌ను హతమార్చారు. 2న, కుల్గామ్ జిల్లాలోని కుల్పోరా సరంద్రో ప్రాంతంలో, స్వతంత్ర పంచ్ మహ్మద్ యాకూబ్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇంటి బయట అతి సమీపం నుంచి కాల్చి చంపారు.