న్యూఢిల్లీ: రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతోపాటు పారదర్శకత, సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది. అధికారులు, అభ్యర్థులు, శిక్షణ సంస్థలు, ఇతరులతో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఈ సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది. దీనిపై ఓ అధికారి ఒకరు మాట్లాడుతూ, అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, పారామెడికల్, లెవెల్-1 కేటగిరీలు సహా అన్ని రకాల గ్రూప్ సీ ఉద్యోగాలకు తొలిసారి వార్షిక నియామక క్యాలెండర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని వల్ల నోటిఫికేషన్‌కు, తొలి దశ పరీక్షకు మధ్య సమయాన్ని సుమారు ఎనిమిది నెలలకు కుదించినట్లు తెలిపారు.
మోసాలకు అడ్డుకట్ట
మోసాలను అరికట్టేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, రియల్ టైమ్ ఫేషియల్ రికగ్నిషన్, ఫొటో వ్యాలిడేషన్ వంటివాటిని అమలు చేయనున్నట్లు తెలిపారు.