న్యూఢిల్లీ: యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మన దేశం నుంచి ఏడు ప్రదేశాలకు చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల కొండలు, ఎర్ర మట్టి దిబ్బలు (విశాఖపట్నం), కర్ణాటక ఉడుపిలోని సెయింట్ మేరీ ఐస్ ల్యాండ్ క్లస్టర్, మేఘాలయాలోని తూర్పు ఖాసి కొండల్లోని పురాతన గుహలు, నాగాలాండ్‌లోని ఓఫియోలైట్(సముద్రం అడుగులోని శిలల క్రమం), మహారాష్ట్ర పంచగని, మహాబలేశ్వర్‌లోని దక్కన్ ట్రాప్స్(లావా నిక్షేపాలతో ఏర్పడిన ప్రాంతం), కేరళ తీరంలోని సహజమైన వర్కల(ఎర్ర లాటరైట్ కొండలు) ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ఆస్తుల జాబితాలో చేర్చినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఆస్తులను(ప్రదేశాలను) జాబితాలో చేర్చడం వల్ల వాటి పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆ ఏడు ఆస్తులను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వీటితో తాత్కాలిక జాబితాలో ఉన్న భారతీయ ఆస్తుల సంఖ్య 69 చేరిందని వెల్లడించారు. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేముందు తాత్కాలిక జాబితాలో చేర్చడ ం తప్పనిసరి పేర్కొన్నారు. దీనికి సహకరించినందుకు భారత పురావస్తు సర్వే సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.