న్యూఢిల్లీ, జూలై 27 : ప్రాచీన మానవులు నరమాంసాన్ని భుజించేవారని, దాదాపు 8.5 లక్షల ఏండ్ల క్రితం చిన్న పిల్లలను చంపి తిన్నారని స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. స్పెయిన్ ఉత్తర ప్రాంతంలోని అటాపుయెర్కాలో గ్రాన్ డోలినా గుహ వద్ద జరిపిన తవ్వకాల్లో పరిశోధకులు దాదాపు 2 నుంచి 4 ఏండ్ల వయసున్న ఓ బాలుడి మెడ ఎముకను కనుగొన్నారు. దానిపై శిరచ్ఛేదన గుర్తులు ఉండటంతో ప్రాచీన మానవులు చిన్న పిల్లలను తిన్నట్టు స్పష్టమవుతున్నదని కాటలాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ పేలియో ఇకాలజీ అండ్ సోషల్ ఇవల్యూషన్ (ఐపీహెచ్ఈఎస్) పరిశోధకుల బృందం వెల్లడించింది.
ఆ పిల్లవాడి శరీర భాగాలు ప్రాచీన మానవ పూర్వీకుడికి సంబంధించినవని పేర్కొన్నది. ఆ పిల్లవాడి వయసు రీత్యానే కాకుండా మెడ ఎముకపై ఉన్న శిరచ్ఛేదన గుర్తుల కారణంగా కూడా ఇది ఎంతో ముఖ్యమైన కేసు అని ఐపీహెచ్ఈఎస్ బృందం సహ డైరెక్టర్ డాక్టర్ పామిరా సలాడీ తెలిపారు. తొలి తరం మానవులు నరమాంసాన్ని భుజంచినట్టు గతంలోనే ఆధారాలు లభించినప్పటికీ చిన్న పిల్లలను చంపి తిన్నట్టు ఆధారాలు లభించడం ఇదే తొలిసారి.