తిరువనంతపురం: కేరళ(Kerala)లో విషాదం చోటుచేసుకున్నది. పెదవి సర్జరీ కోసం 18 నెలల బాలుడికి అనస్థిషియా ఇచ్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఆ చిన్నారి శవమై తేలాడు. కన్నూరులో ఈ ఘటన జరిగింది. ఆ ఘటనలో డాక్టర్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పో్యినట్లు కుటుంబీకులు ఆరోపించారు. కన్నూరు నివాసితులు టి సూరజ్, విజిషా దంపతులకు దేవాన్ష్ శౌర ఒక్కడే కుమారుడు. జూలై 5వ తేదీన ఆ పిల్లోడు ఆడుకుంటున్న సమయంలో కింద పడడంతో పెదవి తెగింది. తొలుత మాతమంగళం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో చికిత్స చేశారు. ఆ తర్వాత బేబీ మెమోరియల్ హాస్పిటల్‌కు అతన్ని తీసుకెళ్లారు.
పయన్నూరులో ఉన్న ఆ ఆస్పత్రిలో అనస్థిషియా ఇచ్చి చికిత్స చేశారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన చిన్నారిని కన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ అంజలీ పౌడ్వాల్ నిర్లక్ష్యం వల్ల అతను మృతిచెందినట్లు కుటుంబం ఆరోపించింది. బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు బుక్ చేశారు. చిన్నారి మృతి పట్ల బేబీ మెమోరియల్ ఆస్పత్రి స్పందించింది.
వైద్యుల నిర్లక్ష్యం జరగలేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అనస్థిషియా ఇవ్వగానే చిన్నారికి అనుకోకుండా గుండె ఆగినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. వెంటిలేటర్ సపోర్టుపై అతనికి చికిత్స అందించి, ఆ తర్వాత కన్నూరు ఆస్పత్రికి తరలించారన్నారు. కోజికోడ్, కన్నూరు, తోడుపుజా, పయ్యన్నూరు, వడకరలో ఆ ఆస్పత్రికి బ్రాంచీలు ఉన్నాయి. అనస్థిషియా ఇచ్చే సమయంలో అన్ని ప్రోటోకాల్స్ ఫాలోఅయినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.