న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనకు చెందిన దర్యాప్తు కొనసాగుతున్నది. సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఎలా ఆ కారును పేల్చి ఉంటాడని ఆరా తీస్తున్నారు. అయితే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను వాడడం వల్లే భారీ స్థాయిలో పేలుడు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హై ఇంటెన్సిటీ బ్లాస్ట్‌కు ఏఎన్ఎఫ్వోనే కారణం కావొచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో 9 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. అయితే పేలుడు ఘటన జరిగిన సమీపంలో అమోనియం నైట్రేట్ ఆనవాళ్లను ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు.
ఫిదాయిన్ తరహాలో ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో డాక్టర్ ఉమర్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ సిటీలోని పలు ప్రదేశాల నుంచి సుమారు 2900 కేజీల ఆర్డీఎక్స్ను సోమవారం రికవరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎర్రకోట్ సమీపంలో కారు పేలిన సమయంలో.. దాంట్లో ఉమర్ ఒక్కడే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. అమోనియం నైట్రేట్ చాలా శక్తివంతమైన పేలుడు పదార్ధాం. దీన్ని సాధారణంగా పరిశ్రమ పేలుళ్లకు వినియోగిస్తుంటారు. గతంలో ఉగ్రవాదులు పలు మార్లు ఈ రసాయనాన్ని వాడారు. ఐఈడీల్లో దీన్ని వినియోగించినట్లు తెలుస్తున్నది.
శక్తివంతమైన పేలుడు ధాటికి పలు మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్ధాలు కూడా పగిలిపోయాయి. చాలా దూరంలో ఉన్న బిల్డింగ్‌ల్లోనూ ఆ శబ్ధం వినిపించింది. టెర్రర్ మాడ్యూల్తో లింకున్న ఇద్దరు డాక్టర్లను పట్టుకోవడంతో.. భయాందోళనకు గురైన డాక్టర్ ఉమర్ ఈ పేలుడుకు పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు.