(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై అయోధ్యలోని స్థానిక దుకాణదారులు, చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఐదు నెలల ముందు రామ మందిరాన్ని ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటించడం.. రాజకీయ ప్రయోజనాల కోసమేనని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనని ధ్వజమెత్తుతున్నారు. ఇదే సమయంలో.. మందిరం పనులు సకాలంలో పూర్తిచేయడానికి రోడ్డు విస్తరణను హడావుడిగా చేపడుతున్న బీజేపీ ప్రభుత్వం.. ధ్వంసమైన తమ దుకాణాలకు ఇచ్చే పరిహారం విషయంలో మాత్రం జాప్యం చేయడమేంటని వాపోతున్నారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడే దుకాణాలను నడుపుకొంటూ పొట్టపోసుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి దుకాణాలను తొలగిస్తే, తమకు ఉపాధి ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. షాపులు కోల్పోయిన తమకు పరిహారం ఎక్కడ? అని నిలదీస్తున్నారు.
వందల దుకాణాలు, ఇండ్లు తొలగింపు
అయోధ్య రామాలయం నిర్మాణంలో భాగంగా నగరంలోని రామ్‌పథ్ (13 కిలోమీటర్లు), శ్రీరామ్ జన్మభూమి పథ్ (800 మీటర్లు), భక్తిపథ్ (800 మీటర్లు) తదితర కీలక మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులను ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో వందలాది దుకాణాలు, ఇండ్లను తొలగించారు. అయితే, కొంత మందికి మాత్రమే పరిహారాన్ని (అదీ కొంత మొత్తమే) చెల్లించిన బీజేపీ సర్కారు.. మిగతావారి విజ్ఞప్తులను పక్కనబెట్టింది. దీంతో అన్నంపెట్టే దుకాణాలను కోల్పోయిన తాము బిచ్చమెత్తుకోవాలా? అని లక్ష్మీకాంత్ తివారీ అనే చిరు వ్యాపారి మండిపడ్డారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు కూడా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోదీకి మద్దతిస్తే గిట్లనా?
మందిరాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం తేలికే. కానీ, ఈ క్రమంలో ఎందరి జీవితాలు చితికిపోయాయో గుర్తించాలి. దేవుడి చిత్రపటాలు, వస్తువులనే మేము అమ్ముతాం. ఇప్పుడు ఆ దేవుడి పేరు చెప్పే మా జీవనాధారమైన దుకాణంతో పాటు ఇంటినీ కూల్చేశారు. ప్రధాని మోదీ, యోగిని నేను సపోర్ట్ చేశా. అయితే, వాళ్ల హయాంలోనే బుల్డోజర్లు మా ఇంటిమీదకు వస్తాయనుకోలేదు. మాకు రూ. లక్ష ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.
– బ్రిజ్ కిశోర్ పాండే, అయోధ్యలో చిరు వ్యాపారి
బీజేపీ మాస్టర్ ప్లాన్
రోడ్డు విస్తరణ పేరిట ఇక్కడి స్థానికుల దుకాణాలను తొలగించి, గుజరాతీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడానికి బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. పౌరుల భద్రతకు ప్రభుత్వం పనిచేయాలి. అయితే, బీజేపీ హయాంలో ప్రజలు భయానికి గురవుతున్నారు.
– పవన్ పాండే,సమాజ్‌వాదీ పార్టీ