Amin Bhat : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ (Gulam Nabi Azad) స్థాపించిన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ అమీన్ భట్ (Mohammad Amin Bhat) ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అమీన్ భట్ 2014లో జమ్ముకశ్మీర్‌లోని దేవ్సర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కారు జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన గులాంనబీ ఆజాద్ ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) పేరుతో సొంత పార్టీని స్థాపించారు.
ఆజాద్‌కు మద్దతుగా అప్పుడు పలువురు నాయకులు DPAP లో చేరారు. అలా చేరినవారిలో అమీన్ భట్ కూడా ఒకరు. అయితే ఇవాళ ఆయన ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇన్నాళ్లు పార్టీలో తనకు అవకాశం ఇచ్చిన గులాంనబీ ఆజాద్‌కు అమీన్ భట్ కృతజ్ఞతలు తెలిపారు. ఆజాద్ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.