పాట్నా: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర సీఎం, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ను కలిశారు. (Lalu Meets Nitish Kumar ) శుక్రవారం పాట్నాలోని సీఎం నితీశ్ కుమార్ నివాసానికి లాలూ వెళ్లారు. కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ గురించి లాలూ, నితీశ్ చర్చించినట్లు సమాచారం.
కాగా, తండ్రి లాలూతో కలిసి సీఎం నితీశ్ కుమార్ను కలిసిన తర్వాత తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీహార్ ప్రభుత్వంలో భాగమైన ఇరు పార్టీల మధ్య నెలకొన్న విభేదాల గురించి వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. వాస్తవానికి దూరంగా మీడియా ప్రశ్నలు అడగడంపై తాను చింతిస్తున్నట్లు తెలిపారు. మహాకూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు ఖరారవుతుందన్న దానిపై ఇంత ఉత్సుకత ఎందుకు? అని ప్రశ్నించారు. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శిబిరం సీట్ల పంపిణీని పరిష్కరించుకుందా? దాని గురించి ఎవరూ పట్టించుకోరు’ అని అన్నారు.
మరోవైపు నితీశ్ కుమార్కు బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయన్న అమిత్ షా వ్యాఖ్యలపైనా తేజస్వీ యాదవ్ స్పందించారు. అమిత్ షా ఏం చెప్పదలుచుకున్నారో అన్నది తన కంటే మీడియాకే ఎక్కువ తెలుసని అన్నారు. అయితే ప్రభుత్వంలో భాగమైన ఆర్జేడీ, జేడీ(యూ) కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు.
కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు16 స్థానాల్లో జేడీ(యూ) గెలిచింది. ఈసారి అంతకంటే తక్కువ సీట్లలో తాము పోటీ చేయబోమని ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి, జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్జేడీ కూడా మెజార్టీ సీట్లు డిమాండ్ చేస్తోంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై ఈ రెండు పార్టీల మధ్య విభేదాలున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ను లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా కలువడం ప్రాధాన్యత సంతరించుకున్నది.