చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ గడిచిన రెండు రోజుల్లో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను రెండు సార్లు కలిశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ రాలేదు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పిస్తేనే , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి వస్తుందని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడింది. మరో వైపు అన్నాడీఎంకేకు చెందిన 28 మంది ఎమ్మెల్యే(AIADMK MLAs)లు పుదుచ్చరిలోని పూరంకుప్పంలో ఉన్న ప్రైవేటు రిసార్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆ 28 మంది ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగంకు మద్దతుదారులు. అయితే టీవీకే చీఫ్‌కు షణ్ముగం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 108 స్థానాలు గెలిచిన టీవీకేకు.. ఇప్పటికే అయిదుగురు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చేశారు. ఇక మెజారిటీకి కావాల్సింది మరో ఆరు మంది ఎమ్మెల్యేల సపోర్టు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ మార్క్ అవసరమైన నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలతో టీవీకే టచ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
మాజీ మంత్రి కేఏ సెంగొట్టియాన్ ఈ కోణంలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగంకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అన్నాడీఎంకే సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కే పళనిస్వామి మాత్రం .. టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో చీలికలు వస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
కీలకమైన పదవులు ఇస్తే .. టీవీకేకు మద్దతు ఇవ్వడానికి షణ్ముగం, ఓఎస్ మణియన్ రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే న్యాయ సలహా తీసుకునే అవకాశం కూడా ఉన్నది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆ పార్టీ ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.