న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసాల జారీ, రెన్యువల్ సత్వరమే చేయిస్తామంటూ కొందరు నకిలీ ఏజెంట్లు దరఖాస్తుదారులను మోసగిస్తున్నారని భారత్లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. అమెరికన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షల నేపథ్యంలో మోసగాళ్లు హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులను సంప్రదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇటువంటి మోసగాళ్ల హామీలను నమ్మవద్దని హెచ్చరించింది.
వీరిని నమ్మితే, ఆర్థిక నష్టంతో పాటు ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని వివరించింది. వీసా అపాయింట్మెంట్లు అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే షెడ్యూల్ అవుతాయని తెలిపింది. ఇతర మార్గాల్లో వీసా ఇప్పిస్తామని ఎవరైనా హామీ ఇస్తే, అది మోసపుచ్చడమే అవుతుందని పేర్కొంది. అధికారిక ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ సొమ్మును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది. ఫలితంగా వీసా ఇంటర్వ్యూలు కొన్ని నెలలపాటు వాయిదా పడ్డాయి.