Hydrogen | న్యూఢిల్లీ: భూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిల్వలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి కింది పొరల్లో దాదాపు 6.2 ట్రిలియన్ టన్నుల హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు ఈ అధ్యయనం పేర్కొన్నది. ఈ నిల్వల్లో చాలా కొద్ది పరిమాణంలో వెలికితీసినా దాదాపు 200 సంవత్సరాలపాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు.
భూమిపై సహజ రసాయన ప్రక్రియ సమయంలో ఏర్పడిన భౌగోళిక (జియోలాజికల్) హైడ్రోజన్ బహుళ అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు అల్బేనియా, మాలి సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని గుర్తించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ నిల్వలు ఉన్నాయని తాజా అధ్యయనం పేర్కొన్నది.
ఇందులో చాలావరకు భూమి లోపలి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ మెక్ గైర్ మాట్లాడుతూ, ‘వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన స్థాయిలో భూమి లోపలి హైడ్రోజన్ నిల్వల్ని వెలికి తీయాలి. ఇందుకోసం అపారమైన ప్రపంచ చొరవ అవసరం’ అని అన్నారు. ప్రస్తుతం భూమిలో నుంచి వెలికి తీస్తున్న సహజ వాయువు ఇంధనం కన్నా ‘హైడ్రోజన్’ ఇంధనం ఎన్నో రెట్లు శక్తివంతమైనది. పెట్రోల్, డీజిల్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీనికి ‘హైడ్రోజన్’ చక్కటి ప్రత్యామ్నాయ ఇంధనం అవుతుందని సైంటిస్టుల నమ్మకం.