Ambanis Pet dog : ముకేశ్ అంబానీ కుటుంబం ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క ‘హ్యప్పీ (Happy)’ మృతి చెందింది. ఏప్రిల్ 30న హ్యాప్పీ మరణంతో దాని యజమాని ఇంట్లో ఒకింత విషాదం నెలకొంది. హ్యాప్పీ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాల్లో భాగంగా ఉంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ హ్యాప్పీని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఆయన దాన్ని పెంపుడు శునకంలా కాకుండా ఫ్యామిలీ మెంబర్గా చూశాడు.
అనంత్ అంబానీకి జంతువులంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన జామ్నగర్లో వంతారా పేరుతో ఓ జంతు సంరక్షణ కేంద్రాన్నే నిర్వహిస్తున్నారు. వంతారాలో ఇతర జీవులతోపాటు అంతరించిపోతున్న జీవ జాతులను కూడా సంరక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన పెంపుడు కుక్క మరణం నేపథ్యంలో వంతారా అధికారిక వెబ్సైట్లో ఒక సంతాప ప్రకటన చేశారు.
‘ఈ రోజు మేము ఎంతగానో ప్రేమంచే హ్యాప్పీకి వీడ్కోలు పలుకుతున్నాం. హ్యాప్పీ మా కుటుంబంలో ఒక మెంబర్గా మెలిగింది. హ్యాప్పీ ఉనికి మా కుటుంబంలో అంతటా వెలుగులు నింపింది. ఇప్పుడు హ్యాప్పీ లేకపోవడంతో అంతా శూన్యం అయ్యింది. ఆ శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రియమైన హ్యాప్పీ విశ్రాంతి తీసుకో. నువ్వు లేని లోటు మాకు ఎప్పుడూ ఉంటుంది’ అని వంతారా హ్యాండిల్లో పోస్టు చేశారు. అదేవిధంగా సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్భయానీ కూడా అంబానీ కుటుంబంతో కలిసి హ్యాప్పీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.