న్యూఢిల్లీ, జనవరి 28 : ప్రపంచ వ్యాప్తంగా 16 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బుధవారం ప్రకటించింది. ఏఐ ఒత్తిడిలో వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు చేపట్టినట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టీ తెలిపారు. దీని కారణంగా ప్రభావితమైన ఉద్యోగులు అంతర్గతంగా కొత్త ఉద్యోగం వెతకడానికి 90 రోజుల సమయం ఇస్తామని, కొత్త ఉద్యోగం కనుగొనలేని, లేదా అందులో చేయకూడదని నిర్ణయించుకున్న వారికి అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా వర్తించే విధంగా మద్దతు అందిస్తామని తెలిపింది.
టెక్సాస్: హెచ్-1బీ వీసాల పిటిషన్లను రాష్ట్రమంతటా వెంటనే స్తంభింపచేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఏజెన్సీలు, పబ్లిక్ యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2027 మే 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించారు. తాజా నిర్ణయం భారత ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. టెక్సాస్ యూనివర్సిటీల్లో వందలాది మంది భారతీయులు ఉద్యోగులుగా ఉన్నారు.