హైదరాబాద్: పుష్ప-2 చిత్ర హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ మంజూరీ చేసినా.. శుక్రవారం రాత్రి చంచల్‌గూడ జైల్లోనే ఉన్నాడు. జైలులో ఉన్న మంజీరా బరాక్‌లో అల్లు అర్జున్‌కు వసతి కల్పించారు. మంజీరా బరాక్‌లో క్లాస్ 1 వీవీఐపీ వసతులు అందుబాటులో ఉంటాయి.
అల్లు అర్జున్‌కు అండర్ ట్రయల్(యూటీ) నెంబర్ 7697 కేటాయించారు. అల్లు అర్జున్‌కు చెందిన అన్ని డిటేల్స్‌ను జైలు అధికారులు రికార్డు చేశారు. సెక్యూర్టీ కారణాల చేత అతన్ని.. సెంట్రల్ ప్రిజన్‌కు చెందిన వెనుక గేటు నుంచి బయటకు పంపించారు. అన్ని ఫార్మాటీలు పూర్తి చేసిన తర్వాతనే అల్లు అర్జున్ను రిలీజ్ చేశారు.
డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 చిత్ర ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న సంథ్య థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ ఘటనలో కేసు నమోదు చేశారు. శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరీ చేశారు.