లక్నో: అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కీలక తీర్పును వెలువరించింది. ముస్లిం వ్యక్తి ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ దానికి సరైన కారణం ఉండాలన్నది. భార్యలందర్నీ ఆ వ్యక్తి సమానంగా చూసుకోవాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ రుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. మొరాబాద్‌కు చెందిన జిల్లా కోర్టు ఓ పిటీషనర్‌కు సమన్లు జారీ చేసిన కేసులో.. అలహాబాద్ హైకోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది. మొదటి పెళ్లి గురించి దాచి పెట్టాడని, రిలేషన్లో ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించాడని రెండో భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నది.
ముస్లిం చట్టాల ప్రకారం ఇస్లాంలో కొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ పెండ్లిళ్లు చేసుకునే సౌలభ్యం ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయన్నది. అయితే ఖురాన్ కల్పించిన ఆ పరిమితులను ఉల్లంఘిస్తూ దుర్వినియోగం చేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. బహుభార్యత్వాన్ని ఖురాన్ ఆమోదిస్తుందని, కానీ సరైన కారణం ఉండాలని కోర్టు చెప్పింది. ఖురాన్లో ఉన్న ఆ వెసలుబాటును స్వార్థ ప్రయోజనాల కోసం మగవాళ్లు వాడుకుంటున్నట్లు కోర్టు పేర్కొన్నది.
షరతు ప్రకారం బహుభార్యత్వం ఆమోదంయోగ్యమని కోర్టు తెలిపింది. బహుభార్యత్వాన్ని ఖురాన్ ఆమోదించడానికి ఓ కారణం ఉందని, పూర్వం ఓ దశలో చాలా మంది మహిళలు వితంతువులు అయ్యేవారని, పిల్లలు అనాథలయ్యేవారని, అరబ్ దేశాల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉండేదని, మదీనాలో ముస్లిం వర్గానికి తీవ్ర నష్టం జరిగిందని, ఆ దశలో బహుభార్యత్వాన్ని ఖురాన్ అంగీకరించిందని, అనాథ పిల్లలను.. వారి తల్లులను రక్షించే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన జరిగినట్లు కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. భార్యలందర్నీ సమానంగా చూసుకోలేని పక్షంలో ముస్లిం వ్యక్తి మరో వివాహానికి అర్హుడు కాదు అని కోర్టు చెప్పింది.