న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన ఖంజావాలాలోని సుల్తాన్‌పురి ఏరియాలో జనవరి 1న దారుణం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటీపై వెళ్తున్న యువతిని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతున్నది.
నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది కాబట్టి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని ఎల్జీ నివాసం ముందు ఆందోళన చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ఘటనపై స్పందించారు.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అన్నారు. ఘటనపై బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు ముగించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఏకంగా ఉరికంబం ఎక్కించాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు.