Waqf Bill | ముంబై, న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఒకప్పటి నల్ల చట్టాలు లేదా ఆటవిక చట్టాల కన్నా వక్ఫ్ బిల్లు అత్యంత ప్రమాదకారి అని ఆల్ ఇండియా ఉలేమా బోర్డు అభివర్ణించింది. మసీదులు, మదర్సాలు వంటి ఇస్లామిక్ ఆస్తులకు ఇది ప్రమాదకరమని బోర్డు జాతీయ అధ్యక్షుడు అల్లామా బనీ నయీమ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ముంబై ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లు పాసైతే మసీదులు, మదర్సాలు, షెల్టర్ హోంలు వంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు, 2025 (ఉమీద్ బిల్లు)కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. మరోవైపు బిల్లు రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే ఎన్జీఓ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లు రాజ్యాంగంలోని 14, 25, 26, 300ఏ అధికరణల ప్రత్యక్ష అతిక్రమణగా ఆ సంస్థ అభివర్ణించింది. ముస్లిం మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని అదీల్ అహ్మద్ ద్వారా దాఖలైన పిటిషన్ పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ కూడా రాజ్యాంగ బద్ధతపై పిటిషన్ దాఖలు చేశారు.