న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కొత్త సిమ్ కోసం మనం ఇచ్చే సమాచారం సురక్షితంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. మీరు ‘ప్రాక్సీ ఎర్త్’ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ లైవ్ లొకేషన్‌తో పాటు మీ పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, ప్రత్యామ్నాయ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీ లాంటి సమగ్ర సమాచారం మీకు కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోవద్దు.
మీరు సిమ్ తీసుకున్నప్పుడు టెలికం ప్రొవైడర్లయిన ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ సంస్థలకు మీరు ఇచ్చిన సమాచారమే మీకు ఆ వెబ్సైట్లో దర్శనమిస్తున్నది. ఈ వెబ్‌సైట్‌ను తయారు చేసిన ప్రోగ్రామర్ రాకేశ్‌ను మీడియా ఇదే విషయమై సంప్రదించగా, తాను చేస్తున్న దానిలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఇంటర్నెట్లో లీకైన వినియోగదారుల డాటాయే తాను అందులో ఉంచానని, కొత్తగా తానేమీ వారి డాటాను హ్యాక్ చేయలేదని ఆయన చెప్పారు.