దిండిగల్, ఏప్రిల్ 3: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి చెప్పారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును విద్రోహ పొత్తుగా ఆమె అభివర్ణిస్తూ అన్నాడీఎంకే రాష్ర్టాన్నే కాకుండా తన సొంత క్యాడర్‌కు కూడా ద్రోహం చేసిందని ఆరోపించారు. శుక్రవారం డీఎంకే అభ్యర్థి నగైజ్యోగి తరఫున నీలకొైట్టె అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ప్రచారం సాగిస్తూ అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ర్టాన్ని, సొంత కార్యకర్తలను మోసం చేసిన విద్రోహ పొత్తుకు ఆయన నాయకత్వం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడిన దాఖలాలు లేవని కనిమొళి అన్నారు. ఏదైనా రాష్ర్టానికి గవర్నర్‌గా మిమ్మల్ని పంపించవచ్చని, ఇప్పుడే ఏ నగరం మీకు ఇష్టమో చెబితే వారు పంపించవచ్చని పళనిస్వామిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అన్నాడీఎంకే అస్పష్ట వైఖరిని ఆమె దుయ్యబట్టారు.
గతంలో ఈ చట్టానికి మద్దతు ఇచ్చి నిరసనకారులపై చర్యలు తీసుకున్న పళనిస్వామి ఇప్పుడు బీజేపీతో రహస్య అవగాహనను కొనసాగిస్తూ ఆ అంశానికి దూరంగా ఉన్నట్లు నటిస్తున్నారని తూత్తుకుడి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఎంకే ఎంపీ చెప్పారు. డీఎంకేని హిందూ వ్యతిరేకి అంటూ అన్నాడీఎంకే-బీజేపీ కూటమి చేస్తున్న ఆరోపణలను కనిమొళి ఖండించారు. ఆలయాల పాలనలో, పునరుద్ధరణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె వివరించారు. తమిళనాడులో ఆలయాలకు సంబంధించి వాటిని పరిరక్షించడానికి తామే పుట్టామని, డీఎంకే హిందువుల వ్యతిరేకి అని అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఆరోపిస్తున్నది.
4,000కు పైగా ఆలయాల జీర్ణోద్ధరణ ఎవరు చేశారు? ద్రవిడ నమూనా ప్రభుత్వం.. డీఎంకే ప్రభుత్వమే. 7,500 ఎకరాలకు పైగా ఆలయాల ఆక్రమిత భూమిని ఎవరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది? ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ప్రభుత్వం అంటూ కనిమొళి ప్రకటించారు. నరేగాను జీ రామ్ జీగా మార్చడాన్ని, త్రి భాషా సూత్రం ద్వారా రాష్ట్ర విద్యా విధానంలో కేంద్రం తలదూర్చడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. నిధులకు కోత కోసి, అజమాయిషీని ఢిల్లీలో పెట్టుకోవడం ద్వారా గ్రామీణ కార్మికుల జీవనోపాధిని బీజేపీ దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై జిల్లాలోని మైలాపూర్ నుంచి పోటీ చేయనున్నాను. కేంద్ర మంత్రి మురుగన్ అవనాశీ నుంచి, పార్టీ మహిళా మోర్చా జాతీయాధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్(ఉత్తరం) నుంచి బరిలో దిగనున్నారు. మొత్తం 27 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైకి టికెట్ ఇవ్వలేదు.
పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ఆయన గత నెల ప్రకటించినా.. పార్టీ మాత్రం ఆయన క్రమశిక్షణ గల సైనికుడని.. పార్టీ విజయం కోసం శ్రమిస్తారని పేర్కొన్నది. రాష్ట్రం నుంచి వచ్చిన నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ తమిళనాడు ఇన్చార్జి పీయూష్ గోయల్ విలేకరులకు తెలిపారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం తిరిగి టికెట్లు కేటాయించారు. ఈ నెల 23న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.