న్యూఢిల్లీ, జనవరి 6: అమెరికాలో అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమాన ప్రయాణికులు శనివారం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సి వచ్చింది! పోర్ట్‌ల్యాండ్ నుంచి ఒంటారియోకు వెళ్లాల్సిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం టేకాఫ్ అయిన కొంతసేపటికి 16,325 అడుగుల ఎత్తులో దాని మధ్య క్యాబిన్ నిష్క్రమణ ద్వారం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫ్లైట్‌ను పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నది. యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొంత మంది ఫోన్లు కూడా బయటకు ఎగిరి పడినట్టు తెలుస్తున్నది.