లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో కాషాయ పార్టీ మత రాజకీయాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని తమ ర్యాలీలకు జనం పెద్దఎత్తున తరలివస్తున్నారని, విజయం తమదేనని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. జన్పూర్లో బుధవారం సమాజ్వాదీ విజయ్ యాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
బీజేపీ నాలుగున్నరేండ్ల పాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. యోగి ఆదిత్యానాధ్ పాలనలో యువతకు ల్యాప్టాప్ల అందచేత నుంచి విమానాశ్రయాల నిర్మాణం వరకూ అనేక హామీలను విస్మరించారని ఆరోపించారు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల ఘనతను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటోందని మండిపడ్డారు.
ప్రధాని ఇటీవల ప్రారంభించిన సరయూ నహర్ ప్రాజెక్టు పనులను 70 శాతం పైగా 2017లో తమ ప్రభుత్వం పూర్తిచేసిందని అఖిలేష్ చెప్పుకొచ్చారు. లఖిపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణం క్యాబినెట్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక 2022 ఫిబ్రవరి-మార్చిలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సర్వశక్తులూ సమీకరించి బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యాయి.