Satluj : ‘సత్లుజ్’ మూవీని ఓటీటీ నుంచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. జీ 5 ఓటీటీలో రెండు రోజులక్రితమే విడుదలైన ‘సత్లుజ్’ను తొలగించాలని తాజాగా జీ5 సంస్థను కేంద్రం ఆదేశించింది. దీంతో ఈ చిత్రాన్ని తమ ఓటీటీ నుంచి జీ5 తొలగించింది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించడాన్ని అకాల్ తఖ్త్ ఖండించింది. అకాల్ తఖ్త్ జతేదార్ గియాని కుల్దీ్ప్ సింగ్ గర్గాజ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదంపై పోరు సందర్భంగా అమాయకపు యువతను ఎలా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకుంటారని, అందువల్ల కేంద్రం ఈ కంటెంట్‌ను అనుమతించాలని ఆయన కోరారు.
ఈ చిత్రాన్ని ఇండియా అంతా ప్రదర్శించాలని ఆయన కోరారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను ఉల్లంఘించేలా ఈ చిత్రాన్ని తొలగించడం సరికాదన్నారు. ఈ అంశంపై బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ కూడా స్పందించారు. ఈ అంశంపై తాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని తనకు కేంద్ర మంత్రి అశ్విని చెప్పారని, ఈ త్రిసభ్య కమిటీ సమీక్ష జరిపిన ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు కేవల్ సింగ్ తెలిపారు. పంజాబ్ ప్రజల భావోద్వేగాలకు బీజేపీ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగిండచడంపై పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కేంద్ర నిర్ణయం పంజాబ్‌పై వివక్ష చూపడమే అని ఆ పార్టీ విమర్శించింది.
ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాలాగే ఈ చిత్రాన్ని కూడా అందుబాటులో ఉంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని కోరింది. పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజె మెయిన్ లీడ్‌గా నటించిన ‘సత్లుజ్’ మూవీ ఓటీటీలో విడుదల కాగా.. కేంద్రం తొలగించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. అయితే, పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా ఈ సినిమాను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి.