చండీగఢ్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో భారీగా ఆయుధాలు లభించాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. (AK-47 Rifle, 25 Pistols Seized) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. భారత్-పాక్ సరిహద్దు సమీపంలో డ్రోన్ ద్వారా ఆయుధాలు జారవిడిచినట్లు బీఎస్ఎఫ్కు సమాచారం అందింది.
కాగా, బీఎస్ఎఫ్, స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ పోలీసులు కలసి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒక అనుమానిత కారును అడ్డుకుని తనిఖీ చేశారు. ఏకే 47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలు, 368 లైవ్ కాట్రిడ్జ్‌లు, 48 మ్యాగజైన్లు, అమెరికాలో తయారైన ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ కారులో ఉన్న అమృత్‌సర్‌లోని రూప్‌నగర్ కాలనీకి చెందిన నిందితుడు రోహన్ ఖోస్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన సహచరుడి ఆదేశాల మేరకు నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు.