Ajit Pawar : మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) అజిత్ పవార్ (Ajit Pawar), ఐపీఎస్ అధికారిణి (IPS officer) అంజనా కృష్ణ (Anjana Krishna) మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట వైరల్‌గా మారడంతో.. దీనిపై అజిత్ పవార్ స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే ఆమెకు ఫోన్ చేసినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణతో అజిత్ పవార్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. ఆ చర్యలను వెంటనే ఆపాలని ఆమెను ఆదేశించారు. దాంతో ఆ అధికారిణి వీడియో కాల్ చేయండని డిప్యూటీ సీఎంను కోరారు. దాంతో పవార్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నీకు ఎంత ధైర్యం? ఉపముఖ్యమంత్రి ఫోన్ చేస్తే నమ్మవా? నన్నే వీడియో కాల్ చేయమంటావా?’ అని ఆమెపై మండిపడ్డారు.
ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అజిత్ పవార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సోలాపుర్‌లో పోలీసు అధికారులతో నా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవడం నా దృష్టికి వచ్చింది. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఫోన్లో మాట్లాడా. పోలీసు విభాగం, ముఖ్యంగా మహిళా అధికారులంటే నాకు చాలా గౌరవం ఉంది. చట్టానికి కట్టుబడి ఉంటా. ఇసుక అక్రమ మైనింగ్‌కు నేను ఎప్పటికీ వ్యతిరేకమే’’ అని రాసుకొచ్చారు.