న్యూఢిల్లీ : దేశంలో డొక్కు విమానాలతో విమానయాన సంస్థలు ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. దేశంలోని 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏడాది కాలంగా 754 విమానాల్లో తనిఖీలు చేపట్టగా 377 విమానాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఆడిట్ చేసిన వాటిలో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువని, లోపాలు కూడా అందులోనే ఎక్కువగా కన్పించాయని కమిటీ పేర్కొన్నది. ఫిబ్రవరి 3 వరకు 405 విమానాల్లో తనిఖీ చేపట్టగా 148 విమానాల్లో లోపాలు ఉన్నాయి. అలాగే 166 ఎయిరిండియా, 101 ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలను ఆడిట్ చేశారు.
ఈ రెండు సంస్థలకు చెందిన వాటిలో సగం లోపాలతో ఉన్నాయి. దీనిపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియాపై డీజీసీఏ నిర్వహించిన తనిఖీని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. ఆ ఆడిట్లో దాదాపు 100 భద్రతా లోపాలను గుర్తించారు. అందులో ఏడు ఉల్లంఘనలు లెవల్-1 స్థాయికి సంబంధించినవని, వాటిని సరిచూసుకోవాలని ఎయిరిండియాకు డీజీసీఏ సూచించిన సంగతి తెలిసిందే. విమానయాన రంగంలో సిబ్బంది కొరతను కమిటీ ప్రస్తావించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని డీజీసీఏ పర్యవేక్షించే సామర్థ్యంపైనా కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది.