టెహ్రాన్, మార్చి 27 : హొర్ముజ్ జలసంధి మూసివేతతో భారత్ సహా పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, దానిని మూసివేసిన ఇరాన్‌కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అయితే ఈ రెండు దేశాల మీద ప్రతీకార చర్యల్లో భాగంగా హొర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం ఆ దేశానికి మంచి లాభసాటిగా మారింది. హొర్ముజ్ మూసివేతతో పెరుగుతున్న ధరల మధ్య చమురు అమ్మకాల ద్వారా అధిక నగదును ఆర్జించడానికి దారితీసింది. మార్చిలో ఇప్పటివరకు చమురు అమ్మకాల ద్వారా టెహ్రాన్ రోజుకు సుమారు 139 మిలియన్ డాలర్లను ఆర్జించినట్టు అంచనా వేశారు. ఇది ఫిబ్రవరిలో రోజుకు 115 మిలియన్ డాలర్లు ఉండేదని ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్ అంచనాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొన్నది.
ఇరాన్ రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చొప్పున మునుపటి నెల స్థాయిలోనే ఎగుమతులు సాగాయని, ఆ దేశ ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగలేదని, పైగా చమురు ధరలు పెరగడం ఆ దేశానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపడుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ మిలిటరీ స్థావరాలపైనే యూఎస్, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఇరాన్ ప్రధాన ఎగుమతి హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్ చెక్కుచెదరకుండా ఉండటంతో అక్కడి నుంచి ఇరాన్ చమురు రవాణా కొనసాగిస్తున్నది. ఇరాన్‌లోని 90 శాతం ఎగుమతులు ఈ దీవి గుండానే సాగుతాయి. ఒక వేళ అమెరికా కనుక ఈ దీవిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసినట్టే. 30 మిలియన్ బ్యారెళ్ల చమురును నిలువచేసే సామర్ధ్యం ఈ దీవి సొంతం.