ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే 850 టోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడంపై అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం నాలుగు వారాల్లోనే అమెరికా సైన్యం ఈ మిసైళ్లను యుద్ధంలో బాగా వాడింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు కొరత ఏర్పడుతుందని అది ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో వాటి సరఫరా, అందుబాటుకు ఆటంకం కలగకుండా ఏం చేయాలనే విషయమై పెంటగాన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని వెల్లడించింది.
నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే టోమహాక్ క్షిపణులు అమెరికా సైన్యం ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఉత్పతి ఏటా పరిమితంగా కొన్ని వందల యూనిట్లు మాత్రమే ఉండటంతో పెంటగాన్ ఆందోళన చెందుతున్నది. వెయ్యి మైళ్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను సమర్థంగా ఛేదిస్తాయని పేరున్న టోమహాక్లు పైలట్లను కట్టుదిట్టమైన రక్షణ ఉన్న గగనతలంలోకి వెళ్లకుండానే దాడి చేయడానికి వీలు కల్పిస్తాయి.