ఒక వైపు పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న అమెరికాకు మరో ముప్పు పొంచి ఉంది. యుద్ధం కారణంగా చమురు ధరలకు రెక్కలొస్తున్న క్రమంలో ఆ ప్రభావం అమెరికా జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. చమురు ధరల నిరంతర పెరుగుదల నియామకాలను మందగింప చేస్తుందని, ఈ ఏడాది నెలకు 10 వేల వరకు ఉద్యోగాల నష్టానికి దారి తీస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. మొదటగా దీని ప్రభావం ఫ్యూయల్ పంపులపై పడుతుందని పేర్కొన్నది.
చమురు ధరల పెంపుతో సంస్థల నిర్వహణా వ్యయం, లాజిస్టిక్స్ భారం పెరుగుతుందని, అదే సమయంలో పెరుగుతున్న ఖర్చులను నిర్వహించుకోవడానికి వినియోగదారులు ఖర్చులను తగ్గించుకుంటారని, ఈ ద్వంద్వ ఒత్తిడి మొత్తం ఆర్థిక వేగాన్ని తగ్గిస్తుందని, చివరకు ఇది నియామకాల విధానంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. ముఖ్యంగా విశ్రాంతి, ఆతిథ్య రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తర్వాత స్థానాల్లో రిటైల్, ఉత్పత్తి రంగాలకు, విద్య, ఆరోగ్య రంగాలకు పాక్షికంగా ఉంటుందని అంచనా వేసింది.