న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానం 24 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కిన విమానంలో ఏసీ లేక కొందరు సొమ్మసిల్లిపోయారు. ఆ తర్వాత ఏరోబ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కాశారు. దీంతో ఎయిర్ ఇండియాకు నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే పలుమార్లు రీషెడ్యూల్ చేయడంతో సుమారు 200 మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
కాగా, తొలుత సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని మార్చారు. అయితే గురువారం రాత్రి 8 గంటలకు విమానంలోకి ఎక్కిన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఏసీ వ్యవస్థ పని చేయకపోవడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు అల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. దీంతో ప్రయాణికులను విమానం నుంచి దించివేశారు. అయితే వారిని ఎయిర్పోర్ట్ లాంజ్‌లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఏరో బ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కాశారు.
మరోవైపు విమాన సిబ్బంది విధుల సమయం ముగియడంతో చివరకు ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు. రిఫండ్ ఆఫర్ చేయడంతోపాటు హోటల్లో బస కల్పించినట్లు కొందరు తెలిపారు. శాన్ఫ్రాన్సిస్కో వెళ్లే విమానాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
కాగా, ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు ప్రయాణికులు విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు డీజీసీఏ శుక్రవారం నోటీసులు పంపింది. ప్రయాణికుల కేర్ పట్ల పదే పదే వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో అన్న దానిపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.