న్యూఢిల్లీ, ఆగస్టు 18: లండన్ హోటల్లో ఎయిర్ ఇండియా ఉద్యోగిని బస చేసిన గదిలోకి చొరబడ్డ ఓ దుండగుడు, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. సమయానికి హోటల్ సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరని, తమను పట్టించుకునే వాళ్లే అక్కడ లేరని బాధితరాలు ఆరోపించారు. లండన్‌లోని హిథ్రూ విమానాశ్రయానికి సమీపంలోని ఓ స్టార్ హోటల్లో ఈ ఘటన జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తి సదరు ఉద్యోగిని బస చేసిన గదిలోకి చొరబడ్డాడని ‘ఎయిర్ ఇండియా’ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్థానిక పోలీసులతో విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితురాలు గట్టిగా అరవటంతో చుట్టుపక్కల నుంచి ఇతరులు వచ్చి దుండగుడి దాడి నుంచి ఆమెను కాపాడారని, దుండగుడ్ని పట్టుకున్నారని తెలిసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని హోటల్ మేనేజ్మెంట్ను ఎయిర్ ఇండియా కోరింది.
బస్సు, వ్యాను ఢీ.. 10 మంది మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని సేలంపూర్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రైవేటు బస్సును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు. గాయపడినవారిని వేర్వేరు దవాఖానలకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.
బుదౌన్-మీరట్ రాష్ట్ర హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మీరట్ వైద్య కళాశాల, దవాఖానకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.