Air India Airbus : సేఫ్టీ సర్టిఫికెట్ (Safety certificate) లేకుండానే దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కు చెందిన విమానం ఒకటి నెల రోజులపాటు రాకపోకలు సాగించింది. ఈ విషయం కలకలం సృష్టిస్తోంది. అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇటీవల ఎయిర్‌బస్ ఏ320 (Airbus A320) విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ భారీ భద్రతావైఫల్యం వెలుగులోకి రావడం గమనార్హం.
ఎయిర్‌వర్తీనెస్ రివ్యూ సర్టిఫికెట్ లేకుండానే నవంబర్‌లో ఎయిరిండియాలోని ఎయిర్‌బస్ విమానం సర్వీసులు కొనసాగించిందని సంస్థ అంతర్గత పర్యవేక్షణ ప్రక్రియలో బయటపడింది. ఈ విషయాన్ని వెంటనే డీజీసీఏకు నివేదించింది. ఈ వైఫల్యానికి కారకులైన సిబ్బందిని సస్పెండ్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. తాము భద్రతాప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇలాంటి ఉదాసీనతను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.
వాణిజ్య విమానాల కార్యకలాపాలకు ఈ ఎయిర్‌వర్తీనెస్ రివ్యూ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. విమానం రాకపోకలు సాగించేవిధంగా అన్ని భద్రతాప్రమాణాలను పాటిస్తుందని ఇది ధ్రువీకరిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ కండిషన్, రికార్డులను విస్తృతంగా సమీక్షించిన తర్వాత ఈ సర్టిఫికెట్ ఇస్తారు. దీన్ని ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.