ఘజియాబాద్: మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు పంక్చర్ అయింది. వేరే కారులో వెళ్లిపోయా. అందరమూ సురక్షితంగా బయటపడ్డాం’ అని అసదుద్దీన్ ట్విట్టర్లో వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు.
అనుమానితుడి అరెస్టు..
ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనలో గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు హపూర్ జిల్లా ఎస్పీ దీపక్ భుకెర్ వెల్లడించారు. అతని నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం, ఇందులో పాలుపంచుకున్న మిగిలిన వ్యక్తుల వివరాలు రాబడుతున్నామని వివరించారు.
కాల్పులను ఖండించిన కేటీఆర్
ఒవైసీపై యూపీలో జరిగిన దాడిని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. కాల్పులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు.