TVK Vijay : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీల్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే కూటమి.. విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా సహా కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 98–120 సీట్లు సాధించే అవకాశాలున్నాయి.
అంటే మెజారిటీకి కాస్త అటూ, ఇటుగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతర సంస్థల సర్వేలు భిన్నంగా ఉన్నప్పటికీ.. విజయ్ పార్టీ ప్రభావాన్ని కాదనలేం. ఒకవేళ యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వే నిజమే అయితే, విజయ్ తమిళనాడులో కింగ్ మేకర్‌గా లేదా కింగ్‌గా కూడా మారగలడు. అందుకే ముందు జాగ్రత్తగా ఏఐఏడీఎంకే విజయ్ టీవీకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే విజయ్ పార్టీ టీవీకేతో కలిసి అధికారం పంచుకునేందుకు చర్చలు జరపాలని ఏఐఏడీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో టీవీకే 98–120 సీట్లు సాధించే ఛాన్స్ ఉంది. ఈ పార్టీకి 37 శాతం ఓటింగ్ రావొచ్చు.
యువత, నిరుద్యోగులు ఈ పార్టీకి అండగా నిలిచారని సర్వే చెబుతోంది. ఇక అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమికి 92–110 సీట్లు రావొచ్చు. ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 22–32 సీట్లు రావొచ్చు. అధికారం చేపట్టాలంటే 118 సీట్లు అవసరం. ఈ నేపథ్యలో డీఎంకే కూటమి కాకుండా విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఏఐఏడీఎంకేతో పొత్తు ఉండే అవకాశం ఉంది. మే 4న ఫలితాల విడుదల తర్వాత అసలు సంగతి తేలనుంది.