న్యూఢిల్లీ, మే 22: మన చేతుల్ని మన నెత్తిన పెట్టడమంటే ఇదే! అంటే మనం రూపొందించిన ఏఐ టెక్నాలజీ భస్మాసుర హస్తమై..మన ఉద్యోగాన్ని పోయేట్టు చేయటం. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించిన ‘మెటా’లో ఇదే జరిగిందట! దీనిపై ఒక యూజర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ పోస్ట్‌లో యూజర్ చెప్పిన విషయం తెలిసాక..‘మెటా’లో ఇంత దారుణమా? అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. టెక్ కంపెనీల తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. జూలియన్ అనే యూజర్ తన భార్య ఉద్యోగం ఎలా పోయిందో వివరిస్తూ దీనిని ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. దాంట్లో ఏముందంటే, ‘సాధారణ పనిని నిలిపివేసి ఏఐ సాధనాలు, పని విధానాలతో పరిచయం పెంచుకోవాలని ఉద్యోగులకు ‘మెటా’ సూచించింది.
ఉద్యోగులు అంతా ఒక అంతర్గత ఏఐ ఉత్పత్తి తొలి వెర్షన్ రూపొందించాలని ఆదేశించారు. కంపెనీ దీనినే మరింత అభివృద్ధి చేసి మెటా ఉపయోగిస్తున్నది’ అని జూలియన్ ఆరోపించారు. ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ, కంపెనీలు ఆటోమేషన్, ఏఐ ఆధారిత వర్క్ ఫ్లో చుట్టూ తమ ఉద్యోగ బృందాలను ఏర్పాటుచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌ను దాదాపు 10 లక్షల మంది వీక్షించినట్టు తెలిసింది. టెక్ కంపెనీల ఏఐ సాంకేతికతలు, ఉద్యోగాల తొలగింపులపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చకు..సదరు పోస్ట్ ఆజ్యం పోసింది. ఇప్పటికే వేలాది మందిని తొలగించిన ‘మెటా’, మరో పెద్ద పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతున్నది. ఈ తరుణంలో ‘ఎక్స్’లో వెలువడిన పోస్ట్ ఆ కంపెనీ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నది.