న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు మనం పనిచేసే, జీవించే విధానాన్ని మార్చివేస్తున్నాయి. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ, గ్రోక్తోపాటు పెరుగుతున్న అనేక ఇతర ఏఐ సాధనాలు ఈమెయిల్స్ రాయడం, పత్రాలను విశ్లేషించడం నుండి ప్రయాణాలను ప్లాన్ చేయడం, ఏఐ ఏజెంట్ల ద్వారా రోజువారీ పనులను నిర్వహించడం వరకు ప్రతి విషయంలోనూ మనకు సహాయపడుతున్నాయి. అయితే ఈ సాధనాలు ఎంత అద్భుతంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఏఐ ఎలా రూపుదిద్దుకుంటుందో ఊహిస్తే అందులో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మో గావ్డాట్ హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలను అస్తవ్యస్తం చేయడానికి, లక్షలాది ఉద్యోగాలను తొలగించడానికి, మనకు తెలిసిన సమాజాన్ని మార్చివేయడానికి అవసరమైన శక్తివంతంగా మారడానికి మానవాళికి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన అంచనా వేశారు. ది డైరీ ఆఫ్ ఏ సీఈవో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) ఆచరణాత్మకంగా ఇప్పటికే అందుబాటులో ఉందని, లేదా అతి తర్వలో రాబోతున్నదని తెలిపారు. తాను ఇప్పటికీ ఏజీఐ 2027కి కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. ఏవైనా దీర్ఘకాలిక ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమయ్యేలోపే ఈ మార్పిడి ఉద్యోగ నష్టాలు, ఆర్థిక అంతరాయం, సామాజిక అశాంతి, యుద్ధంలో ఏఐ విస్తృత వినియోగానికి దారితీయొచ్చన్నారు.
అసలైన ప్రమాదం ఏఐ కాదు, శక్తివంతమైన కంపెనీలు, ప్రభుత్వాలు దానిని ఉపయోగించే విధానమేనని గావ్డాట్ చెప్పారు. ప్రజలు ప్రధానంగా చాట్బాట్లు, వైరల్ వీడియోల ద్వారా ఏఐని అనుభవిస్తున్నప్పటికీ పరిశోధనా ప్రయోగశాలల లోపల జరుగుతున్నది అంతకంటే చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. సిస్టమ్‌లు తమ సొంత కోడ్‌ను మెరుగుపరుచుకోవడం, మార్పులను పరీక్షించడం, మెరుగైన పనితీరు గల వెర్షన్లను అద్భుతమైన వేగంతో విడుదల చేయడం వంటివి చేయగలుగుతున్నాయని గావ్డాట్ చెప్పారు. ఉపాధిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక శ్రమతో కూడిన వృత్తుల కంటే ప్రవేశ స్థాయి నైపుణ్య ఆధారిత పనులపైనే మొదటి ప్రధాన ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. కాల్ సెంటర్ ఏజెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఇతర సాధారణ కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు త్వరగా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. అయితే వడ్రంగి వంటి నైపుణ్యం గల వృత్తులు ఎక్కువ కాలం మనుగడ సాగించవచ్చని.. రోబోలు ఇప్పటికీ అనేక సంక్లిష్టమైన భౌతిక పనులను చేయడంలో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన చెప్పారు.