ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Polls) పోటీకి భారీ సంఖ్యలో రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారిపై చర్యలు చేపట్టాయి. 16 మంది రెబల్ అభ్యర్థులను ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సోనాల్ కోవ్, అభిలాషా గవతురే, ప్రేంసాగర్ గన్వీర్, అజయ్ లంజేవార్, విలాస్ పాటిల్, హన్స్కుమార్ పాండే, కమల్ వ్యావరే, మోహన్రావ్ దండేకర్, మంగళ్ భుజ్‌బల్, మనోజ్ సిండే, విజయ్ ఖడ్సే, షబీర్ ఖాన్, అవినాష్ లాడ్, యాజ్ఞవల్క్య జిచ్కర్, రాజేంద్ర ములక్, రాజేంద్ర ములక్, ఆనందరావును పార్టీ నుంచి బహిష్కరించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ రెబెల్ నేత ముఖ్తార్ షేక్, కస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎంవీఏ కూటమి అభ్యర్థి రవీంద్ర ధంగేకర్కు ఆయన మద్దతు ఇచ్చారు.
మరోవైపు బీజేపీ కూడా ఇదే తరహా చర్యలు చేపట్టింది. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించి 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిలో 40 మంది నేతలు, ఆఫీస్ బేరర్లను బహిష్కరించింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 23న జార్ఖండ్‌తో పాటు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.