(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): అమెరికా సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ) నుంచి ఎంక్యూ-9బీ రకపు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. 31 డ్రోన్ల కోసం రూ.34,500 కోట్లు వెచ్చించనున్నట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ డ్రోన్లలో 15 డ్రోన్లను నేవీకి, చెరో 8 డ్రోన్లను వాయు సేనకు, ఆర్మీకి కేటాయించనున్నారు. 2 వేల మైళ్ల దూరం వరకు నిరంతరాయంగా ఎగిరే ఈ డ్రోన్‌తో 1,700 కిలోల బరువు వరకు ఆయుధాలను తరలించవచ్చు.
డ్రోన్ల రేటుపై విమర్శలు
అంతర్జాతీయ విపణిలో ఇదే మాడల్ ప్రిడేటర్ ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.150 కోట్లు మాత్రమే. అయితే ఒక్కో డ్రోన్‌కు రూ.1,112 కోట్లు చెల్లించేందుకు భారత్ సిద్ధమవ్వడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
స్వదేశీ కంపెనీలను కాదని..
ఈ తరహా డ్రోన్లను మార్కెట్ రేటుకే తయారుచేసే సామర్థ్యం హాల్, డీఆర్డీవో వంటి స్వదేశీ సంస్థలకు ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ‘మేకిన్ ఇండియా’ అని పైకి చెప్పే కేంద్రం కాంట్రాక్ట్‌లను మాత్రం విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నదని పలువురు మండిపడుతున్నారు.
ఎందుకంత మక్కువ?
కొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఎనర్జీ సెక్టార్లో వేళ్లూనుకొన్న జీఏకు ఇరు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే, జీఏ నుంచి ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం కూడా జీఏ పక్షాన భారత్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ డీల్ కారణంగా భారత్‌లోని ఎన్డీఏ సర్కారుకు రాజకీయంగా ప్రయోజనం చేకూరవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఒత్తిళ్లకు ఎన్డీయే ప్రభుత్వం తలొంచిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మాక్ డ్రిల్‌లో షాక్
గత నెలలో చెన్నైలో ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ మాక్ డ్రిల్‌ను భారత నేవీ నిర్వహించింది. అయితే, పవర్ జనరేటర్లో, బ్యాటరీల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఆ డ్రోన్ కుప్పకూలింది. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో భాగంగా హౌతీ రెబల్స్ కూడా ఈ తరహా డ్రోన్లను చాలా తేలిగ్గా కూల్చేయడం తెలిసిందే. ఈ ఘటనలు జరిగాక కూడా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ డీల్‌పై సంతకాలు చేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.