లక్నో: భార్యను తెచ్చేందుకు ఒక వ్యక్తి అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతడికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు అత్తింటి వారు ప్రయత్నించారు (Man set on fire). దీంతో తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ప్రీతి, ధర్మేంద్రకు 2019లో వివాహమైంది. పెళ్లన తర్వాత కూడా ప్రీతి ఎక్కువగా తెవారి బాగియా ప్రాంతంలోని తన పుట్టింటికి వెళ్తున్నది.
కాగా, మూడు నెలల కిందట పుట్టింటికి వెళ్లిన ప్రీతి అక్కడే ఉన్నది. ఈ నేపథ్యంలో తన భార్యను ఇంటికి తెచ్చేందుకు ధర్మేంద్ర జూలై 18న అత్త వారింటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు ఇంట్లో ఉండగా ప్రీతి, ఆమె తల్లి, సోదరుడు కలిసి ఇంటి తలుపులు మూశారు. అనంతరం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించి పారిపోయారు.
మరోవైపు మంటలు అంటుకోవడంతో ధర్మేంద్ర కేకలు వేశాడు. దీంతో పొరుగువారు స్పందించి అతడ్ని కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ధర్మేంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ధర్మేంద్ర సోదరుడి ఫిర్యాదుతో అతడి అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.