లూధియానా: అగ్నివీర్ పథకంపై వివాదం తీవ్ర రూపం దాల్చుతున్నది. జమ్ము కశ్మీరులోని రాజౌరీ సెక్టర్లో ఈ ఏడాది జనవరిలో జరిగిన మందుపాతర పేలుడులో అమరుడైన అజయ్ సింగ్ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు ఈ వివాదానికి మరింత ఊతమిస్తున్నాయి. అజయ్ తండ్రి చరణ్‌జిత్ మాట్లాడుతూ, తన కుమారునికి రూ.48 లక్షలు బీమా సైన్యం నుంచి వచ్చిందని, ఇది ఎక్స్‌గ్రేషియా కాదని చెప్పారు. మరో రూ.50 లక్షలు ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి వచ్చిందని, ఇది కూడా తన కుమారుని ఇన్సూరెన్స్ పాలసీయేనని వివరించారు. పంజాబ్ ప్రభుత్వం రూ.1 కోటి నష్టపరిహారం ఇచ్చిందని చెప్పారు. కేంద్రం లేదా సైన్యం తన కుమారుని మరణానంతరం నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.
ఆగ్రాలో అగ్నివీర్ సైనికుడి ఆత్మహత్య
ఆగ్రా: అగ్నివీర్ సైనికుడొకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేస్తున్న 22 ఏండ్ల శ్రీకాంత్ కుమార్ చౌదరి మంగళవారం అర్థరాత్రి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం భారత వైమానిక దళ గౌరవ వందనం మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీకాంత్ కుమార్ మృతికి కారణాలు తెలియరాలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని షాహ్గంజ్ పోలీసులు తెలిపారు.
శివసేన నేతపై కత్తులతో దాడి
లూధియానా: శివసేన (పంజాబ్) నేత సందీప్ థాపర్ (58)పై నలుగురు నిహంగ్ సిక్కులు శుక్రవారం నడిరోడ్డుపై పట్టపగలే కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి, చికిత్స చేయిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
సరగేట్ తల్లులకు ప్రసూతి సెలవులు
భువనేశ్వర్: సరగసీ ద్వారా తల్లులయ్యే ప్రభుత్వోద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలను పొందే హక్కు ఉందని ఒరిస్సా హైకోర్టు తీర్పు చెప్పింది. సహజంగా తల్లులయ్యేవారికి లేదా దత్తత తల్లులకు లభించే అన్ని సదుపాయాలు వీరికి కూడా ఇవ్వాలని తెలిపింది. ఒడిశా ఫైనాన్స్ సర్వీస్‌లో పని చేస్తున్న సుప్రియ జెనా 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది.
పౌరసత్వానికి ఆధార్ రుజువు కాదు
కోల్‌కతా, జూలై 5: ఆధార్ కలిగి ఉండటం పౌరసత్వం లేదా నివాసానికి రుజువు కాదని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సీనియర్ కౌన్సెల్ లక్ష్మీ గుప్తా గురువారం కలకత్తా హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ రాయితీల కోసం దేశంలో 182 రోజులు నివసించే వారికి ఆధార్ కార్డ్ జారీ చేస్తారని లక్ష్మీ గుప్తా తెలిపారు. విదేశీయులకు సంబంధించి ఆధార్ చట్టంలో ఉన్న 28ఏ నిబంధనను తొలగించాలని జాయింట్ ఫోరమ్ అగైనెస్ట్ ఎన్ఆర్సీ కోరిన నేపథ్యంలో గుప్తా ఈ వివరణ ఇచ్చారు.